Kavitha

నేను ఓడిపోవడానికి వెనుక కుట్ర.. నా దారి నేను వెతుక్కుంటున్నా-కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జాగృతి జనం బాట యాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ లో యాత్రను మొదలుపెట్టిన కవిత.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేశానని కవిత అన్నారు. నిజామాబాద్‌ లో తాను ఓటమి పాలవ్వడం వెనుక కుట్ర ఉందో లేదో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని ఆమె చెప్పారు. ఇంటి గుట్టు బయటపెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకి పంపించారన్న కవిత.. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నాని వ్యాఖ్యానించారు. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాన్న కవిత.. 27 ఏళ్ల వయస్సులో ఉద్యమంలోకి వచ్చానని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశానన్న ఆమె.. తాను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. 

కానీ తనపై కుట్ర చేసి పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత ఆవేధన వ్యక్తం చేశారు. తమపై ఏం కుట్ర జరిగిందో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారన్న కవిత.. ఎన్ని అవమానాలు జరిగినా భరించానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఆశీర్వాదం కావాలని మీ ముందుకొచ్చాన్న ఆమె.. తమొదటి అడుగు మన గడ్డ మీద నుంచే వేయాలని వచ్చానని చెప్పారు. గత పదేళ్లలో మనం కొంత సాధించుకున్నామని.. కానీ అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని అన్నారు కవిత. వాటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న ఆమె.. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని తాను కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.


Comment As:

Comment (0)