తిరుమల లడ్డూ వివాదంలోకి నటుడు ప్రకాష్ రాజ్
ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాద కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె, కొవ్వు ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సంచలన ఆరోపణలు చేశారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందంటూ స్వయంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశమవుతోంది.
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ అంశంపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Rraj) స్పందించారు. ట్విట్టర్-ఎక్స్ వేదికగా లడ్డూ కల్తీ అంశంపై రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను సూటిగా ప్రశ్నించారాయన.
డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది.. దయచేసి ఈ ఘటనపై విచారణ చేపట్టండి.. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి.. అంతే కానీ మీరు ఎందుకు ఆందోళనలను వ్యాపింపజేస్తూ సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు.. దేశంలో ఇప్పటికే మనకు తగినన్నీ మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి.. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు.. అంటూ పవన్ కు సలహా ఇస్తూనే పరోక్షంగా బీజేపీని విమర్శించారు ప్రకాష్ రాజు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తిగామారింది.